ఇండియా vs వెస్టిండీస్ టెస్ట్ సిరీస్

ఫస్ట్ టెస్ట్ - DAY 1 - 12 July 2023

ఇండియా vs వెస్టిండీస్ టెస్ట్ సిరీస్

CWC-2023 క్వాలిఫయర్ మ్యాచ్ లలో అనూహ్యంగా ఓడి వరల్డ్ కప్ ఆడడానికి అర్హత కోల్పోయిన విండీస్ ఇండియాతో జరుగుతున్న మొదటి టెస్ట్ లో 150 పరుగులకే కుప్పకూలి ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది.  టాస్ గెలిచిన వెస్ట్ ఇండీస్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. వెటరన్ వెస్ట్ ఇండీస్ ప్లేయర్ శివనారాయణ్ చంద్రపాల్ వారసుడు ఐనటువంటి త్యాగ్ నారాయణ్ చంద్రపాల్, క్రెయిగ్ బ్రాత్‌వైట్ లు ఓపెనర్లుగా బరిలోకి దిగారు. పది ఓవర్లకు వికెట్ నష్టపోకుండ ఇరవై తొమ్మిది పరుగులు చేసి నిలకడగా ఆడుతున్నట్టే కనబడింది.

అయితే విండీస్ ను మొదటి దెబ్బ అశ్విన్ తీశాడు. కాళ్ళముందు పడి కొంచం బయటకు టర్న్ అయిన బంతి చంద్ర పాల్(44 బంతుల్లో 12 పరుగులు) డిఫెన్సు ఛేదించి వికెట్లను గిరవాటేసింది. దాటిగా ఆట మొదలుపెట్టిన కెప్టెన్ బ్రాత్‌వైట్(46 బంతుల్లో 20 పరుగులు), ఆట అలాగే కొనసాగించే క్రమంలో అశ్విన్ వేసిన బంతిని లాంగ్ ఆన్ మీదుగా బౌండరీకి తరలించాలని చూడగా బంతి ఔట్ సైడ్ ఎడ్జ్ తీసుకొని గాల్లోకి లేచింది. దాన్ని రోహిత్ శర్మ ఒడిసిపట్టాడు.

ఆ తర్వాత వేసిన ఓవర్లలో అశ్విన్ ప్రతి బాల్‌కు వికెట్ తీసేలా కనిపించాడు. తర్వాత దెబ్బ వంతు శార్దూల్ ఠాకూర్ ది.   ఆఫ్‌సైడ్ వైపు ఊరిస్తూ వేసిన బంతిని సులభంగా బౌండరీకి తరలిద్దామని చూసిన రీఫర్(riefer) ఇషాన్ కిషన్ చేతికి చిక్కాడు. ఎంపైర్ బంతి క్యాచ్ పట్టకముందే నేలను తాకిందా?,లేదా? అని చెక్ చేసినా కూడా ఇషాన్ బంతిని ఎంతో అద్భుతంగా ఒడిసి పట్టాడని తేలడంతో రీఫర్(18 బంతుల్లో 2 పరుగులు) వెనుదిరగక తప్పలేదు .

తర్వాత క్రీజులోకి వచ్చిన అథనేజ్ వెస్ట్ ఇండీస్ తరఫున తనకు డెబ్యూ మ్యాచ్ అయినప్పటికీ ఎంతో సాధికారికంగా ఆడాడు. పేసర్స్, స్పిన్నర్స్ ను ఎంతో చక్కగా ఎదుర్కొన్నాడు. నిలకడగా ఆడుతున్నబ్లాక్‌వుడ్ జడేజా బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.  స్ట్రెయిట్ షాట్ ఆడిన బంతి గాల్లో లేచి ఫోర్ వెళ్లేలా కనిపించింది.  అయితే మిడ్ అఫ్ లో ఉన్న సిరాజ్ గాల్లో లేచి ఒంటిచేత్తో ఎంతో చక్కగా బంతిని అందుకున్నాడు. దాంతో బ్లాక్‌వుడ్(34 బంతుల్లో 14 పరుగులు) వెనుదిరగక తప్పలేదు.

అనంతరం క్రీజులోకి వచ్చి కష్టపడి 13 బంతులను ఎదుర్కొన్న ద సిల్వ(Da silva)  జడేజా బౌలింగ్‌లో కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. తన గ్లవ్ తగిలి గాల్లోకి లేచిన బంతిని వెంటనే మళ్ళీ ఒడిసిపట్టాడు ఇషాన్ కిషన్. 60 బంతులు ఎదుర్కొని 18 పరుగులు చేసి ఎంతో ఓపికగా ఆడుతున్న జేసన్ హోల్డర్ షార్ట్ పిచ్ బంతికి దొరికిపోయాడు. బంతిని బౌండరీకి తరలించబోయి డీప్ స్క్వేర్ లెగ్ లో పహారా కాస్తున్న ఒకే ఒక ఫీల్డర్ శార్దూల్ ఠాకూర్ చేతికి చిక్కాడు. వచ్చి రాగానే బౌండరీ కొట్టి అలాగే ధాటిగా ఆడాలని చూసిన అల్జారీ జోసెఫ్(11 బంతుల్లో 4 పరుగులు) మరో ఔట్ సైడ్ ఎడ్జ్ కు  కాచ్ అవుట్ అయ్యి ఏడో వికెట్‌గా వెనుదిరిగాడు.

ఆడుతున్న మొదటి మ్యాచ్‌లోనే తనలోని సత్తా చూపుతూ ఎంతో చక్కగా ఆడుతున్న అథనేజ్(99 బంతుల్లో 47 పరుగులు) అశ్విన్ వేసిన బాల్‌ను బౌండరీకి తరలించాలని చూసి అవుట్ అయ్యాడు. గాల్లోకి లేచిన బంతి 30 యార్డ్స్  సర్కిల్ కూడా దాటలేదు.  కవర్స్ లో ఉన్న శార్దూల్ బంతిని ఒడిసిపట్టాడు.

ఆట చివరి సెషన్లో భారీకాయుడు కార్నివాల్(34 బంతుల్లో 19 పరుగులు నాటౌట్) కాసేపు ఎన్నో చక్కని షాట్స్ ఆడాడు. అయితే బ్యాటింగ్ ఆర్డర్‌లో అతన్ని కాస్త ముందు పంపాల్సింది.  ఒక వైపు అతను ఆడుతున్నా మరోవైపు వికెట్ల వేట కొనసాగింది. జడేజా బౌలింగ్‌లో కీమర్ రోచ్ వికెట్ల ముందు దొరికిపోయాడు. అంపైర్ అవుట్ ఇవ్వకపోయినా బంతి ముందు ప్యాడ్స్ తాకిందని భావించిన టీమిండియా రివ్యూ కోరగా, రివ్యూలో బాల్ ముందు ప్యాడ్స్ తాకిందని, బాల్ ట్రాజెక్టరీలో వికెట్లను కూడా తాకుతుందని చూపడంతో విండీస్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది.

పదో  వికెట్ పడడానికి కూడా పెద్ద సమయం పట్టలేదు. వారికన్ బ్యాట్ తగులుతూ గాల్లోకి లేచిన బంతిని షార్ట్ లెగ్ ఉన్న గిల్ అద్భుతంగా ఒడిసి పట్టడంతో వెస్ట్ ఇండీస్ ఇన్నింగ్స్(64.3 ఓవర్లలో 150 పరుగులకు) ముగిసింది. మొదటి ఇన్నింగ్స్ లో విండీస్కు ఏదైనా సానుకూలాంశం ఉందంటే అది డెబ్యూ మ్యాచ్ లో రాణించిన అథనేజ్ మాత్రమే. మొదటి ఇన్నింగ్స్ లో మొత్తంగా అశ్విన్ ఐదు వికెట్ల ప్రదర్శన చేయగా, రవీంద్ర జడేజాకు మూడు వికెట్లు, శార్దూల్, శిరాజ్ లకు చెరో వికెట్ చొప్పున దక్కాయి.

అనంతరం బ్యాటింగ్ మొదలుపెట్టిన టీమ్ ఇండియా ఓపెనర్లు ఎంతో సాధికారికంగా ఆడారు. ఎదుర్కొన్న మూడో బంతికే యల్బీడబ్ల్యూ నుండి బయటపడ్డాడు రోహిత్. బంతి నేరుగా ప్యాడ్స్ తాకిన కూడా ఎంపైర్ అవుట్ ఇవ్వలేదు. కాన్ఫిడెంట్‌గా రివ్యూ తీసుకుంది విండీస్. అయితే బాల్ వికెట్‌ను తాకే విధానం ఎంపైర్ కాల్ అవడంతో బతికిపోయాడు. అయితే ఆ తర్వాత ఓపెనర్లిద్దరూ వెస్ట్ ఇండీస్ ఎటువంటి అవకాశం ఇవ్వలేదు.

డెబ్యూట్ ప్లేయర్ గా మొదటి మ్యాచ్ ఆడుతున్న జేశ్వాల్ స్పిన్నర్లను,పేసర్లను ఎంతో సమర్ధవంతంగా ఎదుర్కొని టెస్ట్ క్రికెట్‌కు తను సరిపోతానని తెలియజేశాడు. అశ్విన్, జడేజా వికెట్లను రాబట్టిన అదే పిచ్‌పై విండీస్ స్పిన్నర్స్ ఎటువంటి ప్రభావం చూపలేకపోయారు.

ఆట పదో ఓవర్ మూడో బంతికి రోహిత్ ఆడిన స్ట్రెయిట్ డ్రైవ్ చూడడానికి కన్నులకుఁ ఇంపుగా అనిపిస్తుంది. 16 ఓవర్ చివరి బంతికి వర్షం రావడంతో ఆట కాసేపు నిలిచిపోయింది. మళ్ళీ ఆట మొదలైన తర్వాత మరో 14 పరుగులు జోడించిన తర్వాత సెషన్ ముగియడంతో రోజు ఆట(23 ఓవర్లలో 80 పరుగులకు) ముగిసింది. టీమిండియా ఓపెనర్లు ఇద్దరూ రోహిత్(65 బంతుల్లో 35), జైస్వాల్(73 బంతుల్లో 40) నాటౌట్‌గా నిలిచారు.

రెండో రోజు టీమిండియా బ్యాట్స్ మెన్ భారీస్కోర్ సాధిస్తే, ప్రస్తుతం ఉన్న విండీస్ పరిస్థితి బట్టి చూస్తే టీమ్ ఇండియాకు ఇన్నింగ్స్ విజయం సాధ్యమే అనిపిస్తుంది.