ఇండియా vs వెస్టిండీస్ టెస్ట్ సిరీస్

ఫస్ట్ టెస్ట్ - DAY 2 - 13 July 2023

విండీస్‌తో జరుగుతున్న మొదటి టెస్ట్ రెండో రోజు ఆటతో భారత్ పటిష్ట స్థితిలో నిలిచింది. జేశ్వాల్, రోహిత్ శర్మలు సెంచరీలు సాధించడంతో రెండు వికెట్ల నష్టానికి 312 పరుగులు సాధించి 162 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. శుభమాన్ గిల్(11 బంతుల్లో 6 పరుగులు) నిరాశపరిచాడు.

ఓవర్‌నైట్ స్కోర్ 80 పరుగుల వద్ద నుండి రెండో రోజు కొనసాగిన టీమిండియా ఇన్నింగ్స్ ఎంతో నెమ్మదిగా సాగింది. ఓవర్‌కు ఒకటి, రెండు పరుగులు రాబట్టడమే ఎంతో కష్టమైంది. ముఖ్యంగా జేసన్ హోల్డర్ బౌలింగ్ ఆడడానికి ఇండియా ఓపెనర్స్ ఎంతో ఇబ్బంది పడ్డారు. జట్టు స్కోర్ 80 పరుగుల నుండి 100 పరుగులు చేరడానికి దాదాపు 10 ఓవర్లు పట్టింది.

ఎదుర్కొన్న 104 బంతిని బౌండరీకి తరలించి హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు జైస్వాల్. తర్వాత జోరు పెంచిన రోహిత్ కూడా 106 బంతుల్లో అర్థసెంచరీ సాధించాడు. ఆ తర్వాత వెస్ట్ ఇండీస్ స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ముఖ్యంగా భారీకాయుడు కార్న్ వాల్ బౌలింగ్ ఎదుర్కోవడానికి భారత బ్యాటర్లు ఎంతో కష్టపడ్డారు. క్రమంగా ఇండియా లీడింగ్ స్కోర్ చేరగానే ఓపెనర్లిద్దరూ జోరు పెంచారు. రోహిత్ ఫోర్ కొట్టగా, జైస్వాల్ మరో ఫోర్ కొట్టి విండీస్ మీద అత్యధిక పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఆ తర్వాత కూడా భారత బ్యాటర్లలో జోరు తగ్గలేదు. జైస్వాల్ కొన్ని అద్భుతమైన షాట్స్ ఆడి 215 బంతులలో 100 పరుగులు సాధించి డెబ్యూట్ మ్యాచ్ లోనే సెంచరీ చేసిన ఆటగాళ్ల జాబితాలో చేరాడు. అతని క్రికెట్ కెరీర్ కు అధ్బుతమైన నాంది పడింది. 

జైస్వాల్ సెంచరీ అభివాదం

మరోవైపు రోహిత్ కూడా అథినేజ్ బౌలింగ్లో ఫోర్ కొట్టి 220 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. ఈ భారత జోడీ టెస్ట్ క్రికెట్‌లో 229 పరుగుల అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే తర్వాత బంతికే రోహిత్ అవుట్ అయ్యాడు. కీపర్ క్యాచ్ అప్పీల్ ను ఎంపైర్ తిరస్కరించినా కూడా బాల్ బ్యాట్ తగిలిందని భావించిన విండీస్ రివ్యూ కోరింది. రివ్యూ లో బాల్ గ్లవ్ తగిలిందని క్లియర్ గా తెలియడంతో రోహిత్ వెనుదిరగాల్సి వచ్చింది.

రోహిత్ శర్మ 100(220)

ఎదుర్కొన్న రెండో బంతికే రనౌట్ ప్రమాదం నుంచి బయటపడ్డాడు రోహిత్ తర్వాత క్రీజులోకి వచ్చిన గిల్. డ్రైవ్ షాట్ ఆడి రన్ కోసం పరిగెత్తగా బాల్ నేరుగా ఫీల్డర్ దగ్గరకివెళ్లడంతో, గిల్ తిరిగి క్రీజ్ చేరడానికి వెనుదిరగ్గా సబ్స్టిట్యూట్ ఫీల్డర్ అకిమా జోర్డాన్ బాల్ అందుకుని కీపర్ వైపు విసిరాడు. అయితే త్రో వికెట్ కీపర్ తల పైనుండి వెళ్లడంతో గిల్ బతికిపోయాడు. అయితే గిల్ ఇన్నింగ్స్ ఎంతోసేపు కొనసాగలేదు. ఫోర్ కొట్టి సాధికారికంగా కనిపించిన అతను వెంటనే వారికన్ బౌలింగ్లో స్లిప్‌లో అథనేజ్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లీ తొలి బంతి నుంచే ఆచితూచి అడ్డాడు. ఏమాత్రం రిస్కీ షాట్ల జోలికి పోలేదు. 96 బంతులు ఎదుర్కొన్న అతను తాను ఆడిన 81వ బంతికి తొలి బౌండరీ కొట్టాడంటే నమ్మబుద్ధి కాదు. ఇన్నింగ్స్ 273 పరుగుల వద్ద మరో రనౌట్ ప్రమాదం నుండి బయటపడ్డాడు జైస్వాల్. కోహ్లీ ప్యాడ్స్ వైపు వేసిన బంతిని లెగ్ సైడ్ వైపు క్యాజువల్‌గా ఆడి లేని రన్ కోసం ప్రయత్నించాడు. ఈసారి కూడా బంతిని అందుకున్న సబ్స్టిట్యూట్ ఫీల్డర్ కీమా జోర్డాన్ వికెట్‌కు దూరంగా బంతిని విసరడంతో, అప్పటికీ క్రేజ్‌కు చాలా దూరంగా ఉన్నా కూడా జైస్వాల్ బతికిపోయాడు.

133 పరుగుల వద్ద మరోసారి ఔటయ్యే ప్రమాదం నుండి జైస్వాల్ బయటపడ్డాడు. కీమార్ రోచ్ బౌలింగ్ లో వికెట్ల ముందు ఎల్బీడబ్ల్యూగా దొరికిపోయాడు. బాల్ ప్యాడ్స్ ను తాకడంతో విండీస్ ఆటగాళ్లు అప్పీల్ చేశారు. బౌలర్ రోచ్  ఎంత అప్పీల్ చేస్తున్న కూడా ఎంపైర్ తిరస్కరించాడు. బాల్ ట్రాజెక్టరీలో కూడా అన్నీ రెడ్ మార్క్ వచ్చాయి. కాకపోతే అప్పటికే డీఆర్ఎస్ అవకాశాలు అయిపోవడంతో విండీస్ అప్పీల్ చేయలేకపోయింది. ఎంపైర్ నిర్ణయమే తుదినిర్ణయం అయింది.

ఆ తర్వాత అడపాదడపా షాట్స్ ఆడిన జైస్వాల్,కోహ్లీ లు విండీస్ కు ఎటువంటి అవకాశం ఇవ్వలేదు. ఆటముగిసే సమయానికి కోహ్లీ(96 బంతుల్లో 36 పరుగులతో), జైస్వాల్(350 బంతుల్లో 143 పరుగులతో) నాటౌట్‌గా నిలిచారు.

మ్యాచ్ రికార్డు: ఈ మ్యాచ్ లో రోహిత్-యశస్వి జైస్వాల్ జోడీ 229 పరుగులతో కొత్త ఓపెనింగ్ బాగస్వామ్య రికార్డ్ నెలకొల్పారు. ఇంతకు ముందు ఈ రికార్డ్ గవాస్కర్-చేతన్ చౌహాన్ (213, ఇంగ్లండ్ మీద) ఉండేది.

 ఆట మూడో రోజు భారత్ భారీ స్కోర్ చేయడం ఖాయంగా కనబడుతోంది.