ఇండియా vs వెస్టిండీస్ టెస్ట్ సిరీస్

ఫస్ట్ టెస్ట్ - DAY 3 - 14 July 2023

ఊహించినట్టుగానే డొమినికాలో జరిగిన మొదటి టెస్ట్ లో టీమిండియాకు అద్భుత విజయం లభించింది. మూడోరోజు ఓవర్‌నైట్ స్కోర్ 312 పరుగులతో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇండియా 421-5 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి వెస్ట్ ఇండీస్ను ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో ఓడించింది. అశ్విన్ స్పిన్ మాయాజాలానికి విండీస్ విలవిలలాడింది. మొదటి ఇన్నింగ్స్ కంటే ఘోరంగా రెండో ఇన్నింగ్స్ లో 130 పరుగులకే ఆలౌట్ అయింది. వెస్ట్ ఇండీస్ మొదటి ఇన్నింగ్స్ లో హైయెస్ట్ స్కోర్ చేసిన అథనజేదే రెండో ఇన్నింగ్స్ లో కూడా హైయెస్ట్ స్కోర్ అంటే విండీస్ ఆటతీరు ఏతీరుగా సాగిందో అర్ధం చేసుకోవచ్చు. ఇంకా రెండు రోజులు బ్యాటింగ్ ఏం చేస్తాములే అన్నట్లే ఆడారు విండీస్ ఆటగాళ్లు. రెండు టెస్టుల సిరీస్ లో ఇండియా 1-0 లీడ్ సాధించింది.

మూడో రోజు 122 పరుగుల ఆధిక్యంతో ఇన్నింగ్స్ ఆరంభించింది భారత్. విరాట్ 40 పరుగుల వద్ద నేరుగా చేతిలోకి ఇచ్చిన సులువైన క్యాచ్‌ను బ్రాత్‌వైట్ వదిలేసాడు. మరోవైపు జైస్వాల్ బంతిని బౌండరీకి తరలిస్తూ ధాటిగా ఆడాడు. చివరకు 171 (381) పరుగుల వద్ద జోసెఫ్ బౌలింగ్లో కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. 11 బంతులు ఎదుర్కొని మూడు పరుగులు సాధించిన రహానే కీమర్ రోచ్ బౌలింగ్ లో బ్లాక్ వుడ్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందు వచ్చిన జడేజా చక్కని ఇన్నింగ్స్ ఆడాడు. మరోవైపు కోహ్లీ తన అర్ధశతకం(147 బంతుల్లో 50) పూర్తిచేశాడు. 72 పరుగుల వద్ద మరోసారి అవుట్ నుండి తప్పించుకున్నప్పటికీ కోహ్లీ ఇన్నింగ్స్ 76(182) పరుగుల వద్ద ముగిసింది. కార్నివాల్ బౌలింగ్ లో స్లిప్ లో ఉన్న అథనజేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

జట్టు స్కోర్ 421-5 వద్ద ఉన్నప్పుడు ఎవరూ ఊహించని విధంగా ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది టిమ్ ఇండియా. ఇషాన్ 20 బంతులు ఆడి అప్పుడే తన మొదటి రన్ పూర్తిచేశాడు. డిక్లేర్ విషయంలో కొంచెం తొందరపడినట్టు అనిపించినప్పటికీ పిచ్ బౌలింగ్కు అద్భుతంగా సహకరిస్తూ, రన్స్ చేయడం కష్టంగా మారడంతోనే రోహిత్ ఆ నిర్ణయం తీసుకున్నట్లుంది. అది నూటికి నూరుశాతం సరైన నిర్ణయమని విండీస్ ఆల్ ఔట్ అయిన విధానం చూస్తే అర్ధమవుతుంది.

విండీస్ ఇన్నింగ్స్:

271 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన విండీస్ పదో ఓవర్ ఆరంభం వరకు వికెట్ పడకుండా జాగ్రత్త పడింది. పదో ఓవర్ నాలుగో బంతికి త్యాగి నారాయణ్ చంద్రపాల్ ను ఔట్ చేయడం ద్వారా రవీంద్ర జడేజా విండీస్ పతనానికి నాందిపలికాడు. చంద్రపాల్ రివ్యూ తీసుకున్నప్పటికీ ఫలితం దక్కలేదు. కెప్టెన్ బ్రాత్‌వైట్టెడ్ 7(47), ఆఫ్  స్పిన్నర్ అశ్విన్ బౌలింగ్లో స్లిప్‌లో ఉన్న రహానేకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

మూడో సెషన్‌లో విండీస్ పతనం వేగంగా సాగింది. అశ్విన్ బౌలింగ్‌లో  బ్లాక్ వుడ్ ఎల్బీడబ్ల్యూగా వికెట్ల ముందు దొరికిపోయాడు. మరో రివ్యూ విండీస్‌కు వ్యతిరేకంగా వచ్చింది. ఓపికగా ఆడుతున్న రీఫర్ 11(41) జడేజా బౌలింగ్‌లో నాలుగో వికెట్‌గా వెనుదిరిగాడు. బంతి ప్యాడ్‌ను తాకి షార్ట్ లెగ్లో ఉన్న గిల్ చేతిలో పడింది. బంతి బ్యాట్ తగల్లేదని భావించిన రీఫర్ రివ్యూ కోరినప్పటికీ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరగాల్సి వచ్చింది.

సిరాజ్ బౌలింగ్లో ద సిల్వ 13(21) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. మొదటి ఇన్నింగ్స్ లో మంచి స్కోర్ సాధించిన యంగ్ ప్లేయర్ అథనజే రెండో ఇన్నింగ్స్ లో కూడా చూడచక్కని షాట్స్ ఆడాడు. అయితే అశ్విన్ బౌలింగ్‌లో షార్ట్ లెగ్‌లో జైస్వాల్ కు చిక్కి అవుట్ అయ్యాడు. (Wi స్కోర్-178/6)

సిక్స్ కొట్టి దాటిగా ఆడాలని చూసిన జోసెఫ్ అశ్విన్ బౌలింగ్‌లో డీప్ స్క్వేర్ లెగ్ లో గిల్ కు చిక్కాడు. 14 బంతుల్లో నాలుగు పరుగులు సాధించిన కార్నివాల్ ఎనిమిదో వికెట్‌గా వెనుదిరిగాడు. ఆ వికెట్‌తో అశ్విన్ మ్యాచ్ లో 10 వికెట్ల ఘనతను సాధించాడు.

టెస్ట్ క్రిక్కెట్లో ఎనిమిదవ సారి పది వికెట్ల ఘనతను సాధించిన అశ్విన్ ను అభినందిస్తున్న సహచరులు

కీమర్ రోచ్ మూడు బంతులు ఎదుర్కొని ఖాతా తెరవకుండానే అశ్విన్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు.అప్పటికీ సమయం ఐపోయి నిర్ణీత ఓవర్లు ముగిసినప్పటికీ, ఇండియా గెలుపునకు ఒక వికెట్ దూరంలో ఉండడంతో ఆటను అరగంట పాటు పొడిగించారు. మూడు ఫోర్లు కొట్టి దాటిగా ఆడుతున్న వారికన్ 18(18) ను అశ్విన్ వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో (ఎల్బీడబ్ల్యూ) విండీస్ ఇన్నింగ్స్ కు (130/10) తెరపడింది. జేసన్ హోల్డర్ 20(50) నాటౌట్‌గా నిలిచాడు.

అశ్విన్‌కు ఏడు వికెట్లు (7-71), జడేజాకు (2-38),శిరాజ్ కు ఒక వికెట్ దక్కాయి.

మొదటి టెస్ట్ లోనే అద్భుతంగా ఆడిన యశస్వి జైస్వాల్(387 బంతుల్లో 171 పరుగులు) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.

యశస్వి జైస్వాల్ (ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్):  మా ప్రిపరేషన్ చాలా బాగుంది. మేము మొదటి ఇన్నింగ్స్ బాగా ఆడాము.   రాహుల్ ద్రవిడ్ సర్‌తో ఆట గురించి చాలా మాట్లాడాను. నాపై నమ్మకం ఉంచినందుకు సెలెక్టర్లు అందరికీ మరియు రోహిత్ (శర్మ) భాయ్‌కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా గేమ్ అద్బుతంగా సాగింది. భారత్ తరఫున టెస్టు క్రికెట్ ఆడటం చాలా ప్రత్యేకమైనది. ఇది ప్రారంభం మాత్రమే, నేను క్రికెట్ పై నా దృష్టిని కొనసాగించాలి. నా ప్రయాణంలో చాలా మంది వ్యక్తులు నాకు సహాయం చేసారు, ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. సీనియర్ ఆటగాళ్లతో బ్యాటింగ్ చేయడం అధ్బుతంగా అనిపించింది. నేను వారి నుండి మరింత నేర్చుకోవడానికి ఎదురు చూస్తున్నాను.

క్రెయిగ్ బ్రాత్వైట్(విండీస్ కెప్టెన్): మమ్మల్ని పోత్సహించడానికి వచ్చినందుకు డొమినికా ప్రేక్షకులకు నేను నిజంగా ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. మేము బ్యాట్‌తో ప్రేక్షకులను నిరాశపరిచాము.  నన్ను నిరుత్సాహపరిచిన విషయం ఏమిటంటే నేను పరుగులేమీ సాధించకపోవడం. మొదటి ఇన్నింగ్స్ లో మేము చాలా వికెట్లు కోల్పోయాము. అశ్విన్ మరియు జడ్డూ బౌలింగ్ ఆడటం చాలా కష్టంగా అనిపించింది. ఇండియా ఫీల్డ్ సెట్టింగ్ కూడా బాగుంది. అథనాజ్‌ కెరీర్ కు ఇది చాలా మంచి ఆరంభం, అతను బ్యాటింగ్ చేసిన విధానం అతనికి ఆట మీద ఉన్న ప్రేమను చూపుతుంది. అతను బంతితో కూడా రాణించడం మాకు వచ్చే మ్యాచ్ లలో మాకు లాభించే విషయం.  

రోహిత్ శర్మ(ఇండియా కెప్టెన్): దేశం కోసం చేసే ప్రతి పరుగు ముఖ్యం. మొదటి ఇన్నింగ్స్ లో ఓపికగా బ్యాటింగ్ చేసినందుకు ఫలితం లభించింది. మా బౌలర్లు అద్భుతంగా బంతులు వేశారు. మొదటి ఇన్నింగ్స్ లో విండీస్ ను 150 పరుగులకు అవుట్ చేయడం ఆటను మా వైపు తిరిగేలా చేసింది. బ్యాటింగ్ కఠినంగా ఉంటుందని మాకు తెలుసు, ఇలాంటి పిచ్ పై పరుగులు చేయడం అంత సులభం కాదు. మేము సుధీర్ఘంగా బ్యాటింగ్ చేయాలని భావించాము. 400కి పైగా పరుగులు సాధించిన తర్వాత కూడా మేము రెండో ఇన్నింగ్స్ లో బాగా బౌలింగ్ చేసాము. జైస్వాల్‌ కు ప్రతిభ ఉంది. తెలివిగా బ్యాటింగ్ చేశాడు. సహనాన్ని కూడా ప్రదర్శించాడు.  ఏ దశలోనూ అతను భయపడలేదు. అతనికి మేము చెప్పిందల్లా ‘ఎంతో కష్టపడి ఇక్కడి దాకా వచ్చావు. ఇక్కడ నీ ఆటను ఆస్వాదించు’. అని మాత్రమే. ఇషాన్ తన మొదటి పరుగు పూర్తి చేయగానే ఇన్నింగ్స్ డిక్లేర్ చేయాలని భావించము. అందుకు ఇరవై బంతులు పట్టింది. అశ్విన్, జడేజా అద్భుతంగా బౌలింగ్ చేశారు.